Snímky obrazovky:
Popis
"అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు" అను ఈ గ్రంథ రచయిత అయిన శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ముందు మాట
వాస్తవముగా చెప్పాలంటే ప్రథమ దైవగ్రంథము, ద్వితీయ దైవగ్రంథము, అంతిమ దైవగ్రంథము అని మూడే మూడు గ్రంథములు దేవుని ద్వార మనుషులకు ఇవ్వబడినవి. ఈ మూడింటియందు ఒకే దైవజ్ఞానము ఉండుట వలన వాటికి ముందు వెనుక దైవగ్రంథములను పేర్లు వచ్చినవి. మూడు దైవగ్రంథములలో ఆధ్యాత్మికమే ఉండుట వలన గ్రంథములలో ఆధ్యాత్మికము రహస్యముగా దాచిపెట్టబడి ఉన్నదని చెప్పవచ్చును. అందువలననే మూడు సమాజములవారికి మూడు గ్రంథముల వాస్తవికత అర్థముకాలేదని, వారికి అర్థమైనది అంటే అది మతములకు సంబంధించినదే అర్థమైనదని తెలియుచున్నది. గంధమారుతము అంటే వాసనను లేకుండ చేసినది అన్నట్లు గ్రంథము అనగా రహస్యముతో కూడుకొన్నది అని అర్థము గలదు. గంధమారుతము నుండి వాసనను ముక్కులద్వారానే తెలియదగును. అలాగే గ్రంథములోని ఆధ్యాత్మికము బుద్ధి ద్వారనే తెలియబడును. గ్రంథములోని విషయమును ఆత్మ తెలియజేసినప్పుడు మాత్రమే తమ బుద్ధి ద్వార గ్రహించవచ్చును. ఆత్మ తెలియజేయాలనుకోక పొతే మనిషి గ్రంథమును ఎంత చదివినా అందులోని చిన్న ముక్క కూడ అర్థము కాదు. అదే పరిస్థితే నేడు భూమి మీద నెలకొని యున్నది.
నేడు భూమి మీద మూడు గ్రంథములను మూడు సమాజముల వారు నాది ఈ గ్రంథము, నాది ఈ గ్రంథము అని పంచుకొని, నిర్ణయించుకొని మూడింటిని వారి వారి గ్రంథములుగా చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకొనినా ఆ గ్రంథములను వారు అందరూ చదువలేదు. చదివినా అవి అందరికి అర్థముకాలేదు. గ్రంథము అని సూత్రము ప్రకారము అందులోని సమాచారము వారి బుర్రలకు, బుర్రలలోని బుద్ధికి అందలేదు. అలా బుద్ధి గ్రాహ్యమునకు రావాలంటే గ్రంథములోని శక్తి రూపమై యున్న ఆత్మకు చదివే వాడు నచ్చి యుండాలి. ఆత్మకు ఇష్టములేని వానికి గ్రంథము అర్థముకానట్లు ఆత్మ చేయుచున్నది. చదివిన తర్వాత వాని బుద్ధికి అది వాస్తవ భావముతో కాకుండా వేరు భావములో అర్థమగుచున్నది. అందువలన నేడు గ్రంథములను వ్రాయువారు వేరు భావములో వాక్యమునకు అర్థమును వ్రాయడము జరుగుచున్నది. మేము చెప్పునది మూడు గ్రంథముల విషయములలో అలాగే కొనసాగుచున్నది. హిందువులకు భగవద్గీత అర్థముకాలేదు. క్రైస్తవులకు బైబిలు అర్థముకాలేదు. ముస్లీమ్ లకు ఖుర్ఆన్ అర్థముకాలేదు. భగవద్గీత అర్థముకాలేదని మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" బయటికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసినది. అలాగే క్రైస్తవులకు బైబిలు అర్థముకాలేదు అనుటకు మేము వ్రాయబోవు "సువార్త బైబిలు" బయటికి వచ్చిన తర్వాత తెలియగలదు. ఇక పొతే ముస్లీమ్ లకు ఖుర్ఆన్ గ్రంథము అర్థమైనదా, అర్థముకాలేదా అని విషయము ఇప్పుడు మేము వ్రాసిన "అంతిమ దైవగ్రంథములో వజ్రవాక్యములు " అని ఈ గ్రంథము ద్వారా తెలియగలదు.
ఖుర్ ఆన్ గ్రంథములో 114 సూరాలు, 6236 ఆయత్ లు గలవు. అందులో స్థూల మరియు సూక్ష్మ అని రెండు రకముల వాక్యములు గలవు. మేము ఈ గ్రంథము ద్వార 6236 వాక్యములలో 132 సమాచారములకు వివరమును వ్రాసినాము. మేము వ్రాసిన 132 సమాచారములు దాచిపెట్టబడిన జ్ఞానము గల వాక్యములే అని చెప్పవచ్చును. ఈ 132 వాక్యములు వజ్రములవలె అమూల్యమైన వాక్యములుగా చెప్పవచ్చును. ముఖ్యముగా ఈ గ్రంథమును గురించి మేము చెప్పబోవునది ఏమనగా! ఇంతవరకు ఖుర్ ఆన్ అర్థముకాకపోయిన ఇప్పుడు ఈ గ్రంథముతో అర్థముకాగలదు.